"అవే కళ్ళు"[కథ ]----కే.ఎన్.మూర్తి [మొదటి భాగం]
November 21, 2015 | by admin
“అవే కళ్ళు”[కథ ]—-కే.ఎన్.మూర్తి [మొదటి భాగం]

 “అవే కళ్ళు”[కథ ]—-కే.ఎన్.మూర్తి [మొదటి భాగం]  కరెంట్ పోవడంతో  ఫ్యాన్ ఆగి పోయింది.  దూరంగా ఎక్కడో పిడుగు పడిన శబ్దం. ఆ శబ్దానికి మంచి నిద్రలో ఉన్న లీల ఉలిక్కి పడి లేచింది.  కిటికీ తలుపులు వేయకపోవడంతో అవి  గాలికి టక టకమని  కొట్టుకుంటున్నాయి.  ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది.  కళ్ళు పొడుచుకున్నా ఏమి కనిపించడం లేదు. ఇప్పుడేంటో ఈ గాలి …వాన  విసుక్కుంటూ లేచి కూర్చుంది లీల. చీకటంటే తనకు చచ్చేంత భయం.  చిన్నప్పటి నుంచి […]

 “అవే కళ్ళు”[కథ ]—-కే.ఎన్.మూర్తి [మొదటి భాగం] 

కరెంట్ పోవడంతో  ఫ్యాన్ ఆగి పోయింది. 

దూరంగా ఎక్కడో పిడుగు పడిన శబ్దం.

ఆ శబ్దానికి మంచి నిద్రలో ఉన్న లీల ఉలిక్కి పడి లేచింది. 

కిటికీ తలుపులు వేయకపోవడంతో అవి  గాలికి టక టకమని  కొట్టుకుంటున్నాయి. 

ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. 

కళ్ళు పొడుచుకున్నా ఏమి కనిపించడం లేదు.

ఇప్పుడేంటో ఈ గాలి …వాన  విసుక్కుంటూ లేచి కూర్చుంది లీల.

చీకటంటే తనకు చచ్చేంత భయం. 

చిన్నప్పటి నుంచి అంతే. 

రఘు  కరెంట్ పోతే తనను ఆట పట్టించే వాడు . భయపెట్టేవాడు. 

తను కేకలు పెట్టేది…రఘు  తను  భయపడటం  చూసి పగలబడి నవ్వేవాడు. 

వర్షం జోరు పెరిగినట్టుంది  ….మళ్ళీ ఉరుములు మెరుపులు. 

అంతలో వీపును ఎవరో చేత్తో తాకిన ఫీలింగ్  

మరో క్షణం గడిచేక  వీపుమీద  చేత్తో నిమురుతున్నట్టు అనిపించింది.

లీలకు భయమేసింది.

అలా వీపు నిమిరే అలవాటు రఘుకుంది. అదే స్పర్శ..  అదే ఫీలింగ్. 

కానీ అది అసాధ్యం…రఘు  చనిపోయి నెలరోజులవుతోంది.  

మరెవరు ?

ఇంట్లో తనొక్కతే ఉంది. 

రాజు వస్తానని చెప్పి  రాలేదు.

ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. చీకటి కావడంతో ఏమి కనబడటం లేదు.

 అవును … ‘సెల్ లో టార్చ్  ఉండాలి కదా’ ఆ విషయం గుర్తుకొచ్చి 

తలగడ  కింద  వెతికేందుకు చేయి దూర్చింది. 

అంతలో ఎవరో చేయి పట్టుకుని లాగినట్టు అనిపించింది. 

ఆ స్పర్శ చల్లగా ఉంది.

ఆ చల్లదనం తో ఆమె చేయి జిల్లుమంది.

ఒక్క సారిగా గుండె జల్లుమంది. 

‘మరీ అంత భయ పడితే ఎలా ?’చెవిదగ్గర  నవ్వుతూ అన్నట్టు వినిపించింది.

ఆ గొంతు రఘు దే …నో డౌట్.

కానీ అదెలా సాధ్యం ??

రఘు దెయ్యమై ఇలా వెంబడిస్తున్నాడా ?

దెయ్యం అన్న ఊహకే లీల వెన్నులో వణుకు పుట్టింది.

ఒక పక్క భయంగా ఉన్నప్పటికీ, గుండె  బిగ పట్టుకుని తలగడ 

కింద సెల్ కోసం వెతికింది.

అది చేతికి దొరకడం తో ధైర్యం వచ్చింది. 

అమ్మయ్య అనుకుని సెల్ ఆన్ చేసి క్షణంలో టార్చ్ లైట్  వేసింది. 

“మంచం పై  ఎవరైనా ఉన్నారా?” అని చూసింది….ఎవరూ లేరు.

అయితే అంతా తన భ్రమేనా ?

కొవ్వొత్తి ఎక్కడుందో? 

మెల్లగా లేచి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో నుంచి కొవ్వొత్తి 

తీసి వెలిగించింది. కొంచెం వెలుతురు వచ్చింది. 

కిటికీ రెక్కలు మూద్డామని హాల్లోకి  వస్తుండగా తలుపు కొట్టిన శబ్దం 

“ఎవరదీ ?” అరిచింది. అటునుంచి సమాధానం లేదు.

 మరల ఎవరో తలుపు కొట్టిన శబ్దం. 

“ఎవరక్కడ ?” పెద్దగా కేక వేసింది. 

‘వెళ్లి తలుపు తీస్తే ?అమ్మో వద్దులే’ అనుకుంటుండగా కిటికీ దగ్గర 

అలికిడి అయింది.

అంతలో బలంగా వీచిన గాలికి కొవ్వొత్తి ఆరిపోయింది. 

చకచకా వెనక్కి వచ్చి మంచంపై కూర్చుంది.

ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. 

‘ఈ రాజు ఎక్కడున్నాడో? ‘ అనుకుని ఫోన్ చేసింది.

మూడు సార్లు చేస్తే అప్పుడు ఎత్తాడు 

“ఎక్కడున్నావ్” విసుగ్గా అడిగింది 

“వద్దామనుకున్నా …ఇంతలో వాన … అది చెబుదామని 

ఫోన్ చేస్తే నీ ఫోన్ ఆఫ్ లో ఉంది.” అన్నాడు. 

“అన్ని అబద్ధాలే… నా ఫోన్ ఆన్ లో ఉంది. 

వాన అనే వంకతో పెళ్ళాం పక్కన పడుకుని కులుకుతున్నావా ?”

“మధ్యలో ఆమె   సంగతి ఎందుకు ?”

“నీ సంగతి నాకు తెలీదా ? నేను ఇక్కడ భయంతో చస్తున్నా… 

రఘు దెయ్యం లా వెంట పడుతున్నాడు.”

“దెయ్యమా ?వాట్ నాన్సెన్స్”

“నాన్సెన్స్ కాదు నిజమే… ఇక్కడ మంచం మీద కూర్చుంటే 

వెనుకనుంచి నా వీపు నిమిరేడు. 

తలగడ కింద సెల్ తీస్తుంటే చేయిపట్టుకున్నాడు.” 

“అది నీ భ్రమ … ఎక్కువగా అతని గురించి ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. “

“ఎంతైనా మొగుడు కదా …. ఆలోచనలు రాకుండా ఎలా ఉంటాయి . 

నాకెందుకో భయమేస్తోంది. మనం రఘుని చంపి తప్పు చేసాం అనిపిస్తోంది.” 

 “ఇపుడు తప్పు అనుకుంటే ఎలా ?లేక పోతే ఆస్తి ఎలా వస్తుంది?”

“ఏమో నీ మోజులో పడి నువ్ చెప్పిందల్లా చేశా… ఇపుడెమో భయంగా ఉంది.”

“భయపడే కొద్దీ భయమేస్తుంది.” 

“సరే నువ్వు రా మరీ” అంది గోముగా 

“సరేలే.” అన్నాడు 

వాన కొంచెం తగ్గినట్టుంది .కరెంట్ ఎప్పుడొస్తుందో ఏమో ?

మళ్ళీ కొవ్వొత్తి వెలిగిద్దామని లేవబోయింది.

ఎవరో వెనుక నుంచి చీర కొంగు పట్టుకుని గట్టిగా లాగినట్టు అనిపించింది. 

ఒక్క క్షణం గుండె ఆగింది. 

“ఇందాక చూస్తే ఎవరూ కనిపించలేదు.

ఇప్పుడు  ఏంటి ఇలా ?”భయంతో వణికి పోయింది. 

“ఏదో జరుగుతోంది…. ఖచ్చితంగా ఇది రఘు పనే.” 

అనుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి చూసింది. 

మంచానికి అటు వైపు నుంచి ఒక  ఆకారం తనకేసి వస్తున్నట్టు లీలగా కనిపించింది 

దాని తాలూకు కళ్ళు చింత నిప్పుల్లా మెరుస్తున్నాయి.

ఆ కళ్ళ ను చూడగానే లీలకు ఒళ్లంతా చెమటలు పట్టేయి.

రఘు కళ్ళు కూడా అలాగే ఉంటాయి. 

గుండె వేగంగా కొట్టు కోసాగింది. 

 భయంతో పెద్దగా కేక వేయాలని ప్రయత్నించింది కానీ గొంతు పెగల్లేదు.

మరో క్షణం అక్కడే నిలబడితే ఆ ఆకారం ఏమి చేస్తుందో ?ఏమో?

ఆ భయంలో  చీర  ఊడిపోయిన విషయం కూడా  ఆమె గమనించలేదు. 

ఆ ఆకారం మెల్లగా వస్తున్నట్టు కనిపించింది. 

అంతలో కరెంట్ వచ్చింది. “అమ్మయ్య” అనుకుంది. 

మంచం వైపు చూస్తే ఎవరూ లేరు. 

ఆ గదంతా కలయ చూసింది. ఎవరూ కనిపించలేదు. 

కొంచెం ధైర్యం వచ్చింది … అయితే ఇంత సేపు తను భ్రమ పడ్డానా ?

‘మరి ఆ కళ్ళు ?? ఏమో ?’ అనుకుని  గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. 

వాన కూడా ఆగినట్టుంది. 

కొంచెం ఫ్రెష్ అయితే కానీ టెన్షన్ తగ్గదు అనుకుని బాత్రూంలో కొచ్చింది. 

మొహం కడుక్కుని అద్దంలోకి చూసింది. 

గుండె ఆగింది… ఒక్క క్షణం.  

అద్దంలో తన వెనుకనే  రఘు నిలబడి నవ్వుతున్నాడు.

అవే కళ్ళు… ఆ కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి. 

చటుక్కున వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. 

మళ్ళీ అద్దంలోకి చూసింది. 

ఆ కళ్ళు మరింత పెద్దగా కనిపించాయి. 

అంతే..  కెవ్వున కేకేసి పడిపోయింది లీల. 

81 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.