October 1, 2014 | by admin
శృంగేరి

“శృంగేరి”  —ఓం శ్రీకర్ చిట్టా బత్తిన శృంగేరి అనే పేరు “శృంగగిరి ” అనే పర్వతం నుంచి వచ్చింది .  శృంగేరికి 15  కిలో మీటర్ల  దూరంలో “శృంగగిరి ” అనే పర్వతం వుంది.  శృంగేరి  పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఆది శంకరాచార్యుల వారు ప్రభోదించిన ” అద్వైత సిద్దాంతం “. “అద్వైత సిద్దాంతం” అంటే మన కళ్ళ ముందు కనిపించేవి ప్రతిదీ ఏదో ఒక రోజున ప్రస్తుతం వున్న రూపాన్ని పోగొట్టుకుని ఆ పంచ భూతాల్లో […]

“శృంగేరి”  —ఓం శ్రీకర్ చిట్టా బత్తిన

శృంగేరి అనే పేరు “శృంగగిరి ” అనే పర్వతం నుంచి వచ్చింది .  శృంగేరికి 15  కిలో మీటర్ల  దూరంలో “శృంగగిరి ” అనే పర్వతం వుంది.  శృంగేరి  పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఆది శంకరాచార్యుల వారు ప్రభోదించిన ” అద్వైత సిద్దాంతం “. “అద్వైత సిద్దాంతం” అంటే మన కళ్ళ ముందు కనిపించేవి ప్రతిదీ ఏదో ఒక రోజున ప్రస్తుతం వున్న రూపాన్ని పోగొట్టుకుని ఆ పంచ భూతాల్లో కలసి పోవడం తప్పని సరి కనుక , మన కళ్ళ ముందు కనిపించే ఆ ప్రస్తుత రూపం కేవలం మాయా రూపమే కదా ! అంటే కొంతకాలం పాటే  ఆ రూపం వుండి , ఆ తరువాత మార్పు చెందుతుంది కదా! అందువల్ల మనం చూసే ఈ సృష్టి లో ప్రతి ఒక్కటీ ” మాయ ” అన్నారు ఆది శంకరాచార్యుల వారు. తను ప్రభోదించిన ఈ అద్వైత సిద్దాంతాన్ని అందరికి తెలియచెబుతూ, భారత దేశం మొత్తం అంటే , బదరి వరకు పర్యటించి , అప్పటి పండితులందరి చేత తన సిద్దాంతాన్ని ఆమోదింపచేసి, దక్షిణ భారతానికి తిరిగి వచ్చిన శంకరాచార్యులు,  ఈ శృంగగిరి  ప్రాంతములో పర్యటిస్తూ వుండగా  ఒకరోజు, ఒక చోట, ఒక గర్భిణిగా వున్న కప్ప  ఒకటి పడుకుని వుండగా, దానికి ఎండ తగలకుండా, ఒక నాగుపాము తన పడగ  విప్పి  ఆ కప్ప మీద తన పడగనీడ పడేటట్లు నిలబడి వుండటం చూసారు. ఆజన్మ శత్రువులైన ఆ రెండు అలాటి స్థితిలో ఉండటానికి, ఈ స్థలంలో   ఏదో పవిత్రత వుందని అర్ధం చేసుకున్న శంకరాచార్యుల వారు, సరిగ్గా ఈ స్థలంలోనే తన ప్రధాన కార్యాలయమైన “శృంగేరి  మఠము”  నెలకొల్పారు. తన తరువాత తను ప్రతిపాదించిన అద్వైత సిద్దాంతం భారత దేశమంతటా నిరాటంకంగా కొనసాగింపబడటానికి  అనుకూలంగా, తూర్పున పూరిలో,  పశ్చిమాన ద్వారకలో, ఉత్తరాన బదరిలో, మూడు మఠములను నెలకొల్పారు.

 

                        శృంగేరి  ఒక చిన్న గ్రామం . బస్సు స్టాండు నుండి శారదాదేవి ఆలయం అర కిలోమీటర్ దూరం లో వుంది . శారదాదేవి ఆలయం ” తుంగానది ” ఒడ్డునే వుంది . ఆదిశంకరాచార్యుల వారు , తానూ నిత్యమూ అర్చించుకునేందుకు గాను, తన ఇష్ట  దైవమైన శారదా దేవి మూర్తిని, మంచి గంధపు చెక్కతో చేయించి ప్రతిష్టించుకున్నారు. ఆ తరువాత విద్యారణ్య స్వామి ( శృంగేరి రెండవ పీఠధిపతి) తన గురువు గారి మీద భక్తితో, చందనపు విగ్రహానికి బదులు ఒక బంగారపు విగ్రహం చేయించి  ప్రతిష్టించారు .
                      శారదాదేవి ఆలయం కొంత ప్రత్యేకత కలిగి వుంటుంది . సాదారణంగా ప్రసిద్దమైన ఆలయాన్ని కొండ రాళ్లతో నిర్మింపబడి వుంటాయి. కానీ శారదాదేవి ఆలయపు విమాన భాగం ఎర్ర రాయి కట్టడం. అటు గుండ్రంగాను, నలుచదరంగాను కాకుండా, కొణాలు,  కొణాలుగా  వుంటుంది . లోపల మడపం చాల పెద్దదిగా బాగా విశాలంగా వుంటుంది. ప్రతి స్తంభం మీద ఆశ్చర్యం కలిగించే చెక్కడాలు, శిల్పాలు ఎన్నో వున్నాయి. అమ్మవారి  గర్భగుడి నల్ల చలువ రాతి నిర్మాణం . అద్భుతమైన చెక్కడాలతో, నిగనిగా  మెరిసే ఆ గర్భగుడి లో ఎన్నో ఆభరణాలతో ధగ ధగ లాడుతూ  వుండే అమ్మవారి విగ్రహాన్ని తనివితీరా చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది .
శారదా దేవి ఆలయానికి కుడి వైపున విద్యాశంకర ఆలయం వుంది . 105 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం వహించిన శ్రీ విద్యాశంకరుల వారికి  కృతజ్ఞతగా  విద్యారణ్య స్వామి ఈ ఆలయాన్ని నిర్మింపచేసారట. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి వారు లింగాకారంగా వుంటారు. స్వామికి ఇరుప్రక్కల వినాయకుడు, అమ్మవారు వుంటారు.  ఈ  ఆలయపు ముఖ మడపంలో వుండే  12 స్థంబాలు, 12 రాశుల పేర్లను కలిగి వుంటాయి. సూర్యుడు సంవత్సరం పొడుగునా  ఒక్కొక్క నెల ప్రారంభంలో  ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు కదా, సరిగ్గా ఆ రోజున ఆ సూర్య భగవానుని కిరణాలు ఆ రాశి పేరు కల స్థంభం మీద పడతాయి . జ్యోతిష్య, ఖగోళ, గణిత, వాస్తు శాస్త్రాలన్నింటి లోను  పట్టు ఉంటేనే ఇలాంటి ఆలయ నిర్మాణం సాధ్యపడుతుంది . ఈ ఆలయపు స్థంబాల మీద వుండే సింహపు ఆకారాన్ని పోలిన దేవా మృగపు మూర్తులు, ఆ విగ్రహాల నోటిలోనుంచి వేళ్ళాడుతూ వుండే బంతులు, పై కప్పు మీద నుండి వేళ్ళాడుతూ వుండే రాతి గొలుసులు, అన్ని ఏకశిలా నిర్మితాలే . ఆ ఆలయపు బయట భాగం కూడా విచిత్రంగా వుంటుంది . మొత్తం గోడలు కోణాలు , కోణాలుగా   వుంటుంది . పొడుగాటి రాతి పలకలు ఒక దాని ప్రక్కన ఒకటి నిలబెట్టి అతికించారా అనిపిస్తుంది . అల వుంది కూడా గోడ మొత్తం ఎన్నో రకాల మూర్తులు , శిల్పాలతో నిండి వుంటుంది .
        ఈ ప్రాంగణం లోనే వెనుక వైపున ఆది శంకారాచార్యుల వారి ప్రధమ శిష్యుడైన సురేశ్వరుని  ఆలయం, శ్రీరాముని ఆలయం, హనుమ, దుర్గ, భైరవ, కాళిక  ఆలయాలు వున్నాయి. ఈ ప్రాంగణాన్ని ఆనుకుని, దక్షిణపు అంచున తుంగానది ప్రవహిస్తూ వుంటుంది. ఆలయ ప్రాంగణపు ఒడ్డు  నుంచి అవతలి వైపు వరకు ఒక వంతెన వుంది. అవతలి వైపు కొబ్బరి, పోక, అరటి, పనస మొదలైన చెట్లతో  ఒక చిన్న సైజు అడవిలాగా వుంటుంది. ఈ వనాన్ని నారాయణవనం అంటారు. ఇక్కడ   శృంగేరి పీఠాధిపతుల నివాస గృహము, ఆలయ కార్య నిర్వాహక కార్యాలయము, ఇంతకు ముందువున్న  పీఠాధిపతుల విగ్రహ మూర్తులు వున్నమ్యూజియం, ఈ వనం మధ్య వున్నాయి. ఇప్పుడు వున్న 36వ  పీఠాధిపతులు  శ్రీ భారతీ తీర్ధ స్వామి వారు, ప్రతి రోజు రాత్రి ఎనిమిది  గంటలకు చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం చేస్తారు .
ఆలయపు ముందు భాగంలో ఉచిత గదులు ఇచ్చే సత్రాలు , అద్దెకు ఇచ్చే గదులు వున్నా సత్రాలు వున్నాయి సెలవు రోజుల్లోనూ ,పండుగ రోజుల్లోనూ రూములు దొరకటం చాల కష్టం . అందువల్ల
THE ADMINISTRATOR ,
SRI SRINGERI MATH &ITS PROPERITIES,
CHIKMANGULOOR DISTRICT
SRINGERI-577139
అనే అడ్రస్ కు ముందుగా డబ్బులు పంపి,మనకు కావలసిన రోజుకు  రూం రిజర్వు చేసుకోవచ్చు  .

వసతి సౌకర్యాలు

 1. శ్రీ శంకర కృప
 2. శ్రీ శారద కృప
 3. యాత్రి నివాస్
 4. శ్రీ భారతీ తీర్ధ విహార
 5. శ్రీ శంకర సదన
 6. శ్రీ భారతీ తీర్ధ కృప
ఫోన్ నంబర్స్ : 08265-250123
                   08265-250594
                   08265-250192

ప్రయాణ సౌకర్యాలు

శృంగేరి, ఉడిపికి తూర్పుగా, అంటే సముద్ర తీరానికి  80 కిలోమీటర్ల  దూరంగా పడమటి కనుమల మధ్యలో వుంది . అందువల్ల  శృంగేరికి ఎటు  ప్రక్క నుంచి వెళ్ళాలన్నా , పడమటి కనుమల గుండా ప్రయాణిస్తూ బస్సులో, వెళ్ళాల్సిందే. అయితే  ధర్మస్థల, ఉడిపి, కుందాపూర్, చిక్ మంగుళూర్, షిమోగా, మొదలైన చోట్ల నుండి శృంగేరి వరకు డైరెక్ట్ బస్సులు వున్నాయి. మంగళూరు నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది. షిమోగా నుండి కూడా తరచు బస్సు సౌకర్యం ఉంది. శృంగేరి నుండి ఉడిపికి బస్సు ఆగుంబె అనే ఊరి మీదుగా మలనాడు పర్వతశ్రేణుల మధ్య నుండి వెళ్తుంది. 24 సన్నటి హైర్ పిన్ ఘాట్ రోడ్డులో ఉడిపి చేరు కోవచ్చు.

శృంగేరిలో ముఖ్యమైన దర్శనీయ విశేషాలు:

 1. శారదాంబ దేవాలయం
 2. విద్యాశంకర దేవాలయం
 3. ఆది శంకురల దేవాలయం
 4. నరసింహవనం
 5. తుంగ నది
 6. శృంగేరి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. శృంగేరి పట్టణానికి మంగుళూరు సమీప విమానాశ్రయం. శృంగేరి పట్టణం బెంగుళూరుకు 330 కి.మీ. దూరం, మంగుళూర్ నుండి 110కి.మీ. దూరం, ఉడిపి నుండి 80 కి.మీ. దూరం, షిమోగా నుండి 105  కి.మీ. దూరం, చిక్ మంగులూర్ నుండి 100  కి.మీ. దూరంలో ఉండి, సౌకర్యవంతమైన బస్ సర్వీస్ కలిగి ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్లు, షిమోగా మరియు       కడూర్ లు.
 
శృంగేరి  చుట్టు   ప్రక్కల  ముఖ్యమైన దర్శనీయ విశేషాలు:
1. ఆగుంబే ( సూర్యాస్తమయం ఇక్కడి నుంచి  చూస్తె చాల అద్భుతంగా వుంటుంది( sunset point ), దేశములో రెండవ విస్తారముగా వర్షాలు కురిసేది ఇక్కడే.     దీనిని రైన్ ఫారెస్ట్ అని కూడా అంటారు .
2. కిగ్గ  ( రిష్య శృంగ లింగం ) —- శృంగేరి నుంచి 9 kms
3. అనేగుడ్డే ( వినాయక దేవాలయం )
4. హొరనాడు ( అన్నపూర్ణేశ్వరి దేవాలయం ) — శృంగేరి నుంచి                                                                                      60 kms
5. కలస( కాళేశ్వర స్వామి ) — హొరనాడు నుంచి 8 kms
6. కొల్లూరు ( మూకాంబిక దేవాలయం ) —శృంగేరి నుండి 110  kms
7. ఉడిపి ( శ్రీ కృష్ణ దేవాలయం)— శృంగేరి నుండి 80 kms
8. ధర్మస్థల ( శ్రీ మంజునాధ స్వామి ఆలయం ) —శృంగేరి నుండి 120 kms
9. కుక్కే (సుబ్రహ్మణ్య  ఆలయం )– ధర్మస్థల నుండి 60 kms

ఆది శంకారాచార్యుల వారు 12 సంవత్సరాలు పైగా నివసించిన ఈ శృంగేరి క్షేత్రం  ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పవిత్ర ప్రదేశం.

89 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.