వరం
June 16, 2015 | by admin
వరం[కథ ]—— తిరుమలశ్రీ

ఓ గ్రామంలో – ఓ ఇంటి పెరట్లో ఉన్న వేపచెట్టు మీద పక్షి జంట ఒకటి కాపురం ఉంటోంది. వాటి పిల్లలు ఆమధ్యే పెద్దవయ్యాయి. ఓ రోజున పిల్లలు తల్లితో, “అమ్మా! మేమిక స్వేచ్ఛాజగతి లోకి ఎగిరిపోవాలనుకుంటున్నాం. మా బ్రతుకులు మేము బ్రతుకుతాం” అన్నాయి. ఆ మాటలు వినగానే మిక్కిలి దిగులు కలిగింది తల్లికి. ’మీకిప్పుడు రెక్కలు వచ్చాయి. ఈ తల్లి అవసరం లేదు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నారు’ అనుకుంది మనసులో బాధగా. గతం గుర్తుకువచ్చింది దానికి… వయసు […]

వరం

వరం

ఓ గ్రామంలో – ఓ ఇంటి పెరట్లో ఉన్న వేపచెట్టు మీద పక్షి జంట ఒకటి కాపురం ఉంటోంది. వాటి పిల్లలు ఆమధ్యే పెద్దవయ్యాయి.

ఓ రోజున పిల్లలు తల్లితో, “అమ్మా! మేమిక స్వేచ్ఛాజగతి లోకి ఎగిరిపోవాలనుకుంటున్నాం. మా బ్రతుకులు మేము బ్రతుకుతాం” అన్నాయి.

ఆ మాటలు వినగానే మిక్కిలి దిగులు కలిగింది తల్లికి. ’మీకిప్పుడు రెక్కలు వచ్చాయి. ఈ తల్లి అవసరం లేదు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నారు’ అనుకుంది మనసులో బాధగా.

గతం గుర్తుకువచ్చింది దానికి…

వయసు వచ్చిన తాను మనసుకు నచ్చిన ఓ మగ పక్షితో జత కట్టింది. ఒకరంటె ఒకరికి ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి.  ఆ వేపచెట్టు పైన గూడు కట్టుకుని కాపురం పెట్టారు. తరువాత తాను గుడ్లు పెట్టి పొదగడం జరిగింది. రెండు ఆడ పిల్లలు, రెండు మగ పిల్లలూను. వాటిని చూసుకుంటూ మురిసిపోయేవారు ఇద్దరూ. పసికూనలను పాములు, పిల్లులు, గ్రద్దలు పొట్టను పెట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. వాటికి ఎగరడం నేర్పారు. వెంట ఉండి బయటి ప్రపంచాన్ని చూపించారు. ఆహారం సేకరించే సులువులు అబ్బించారు. శత్రువుల బారి నుండి కాపాడుకునే మెలకువలు నేర్పించారు. ప్రేమానురాగాలతో వాటిని పెంచి పెద్ద చేసారు…

ఈ రోజు అవి విశాల విశ్వం లోకి పయనం కడతామనేసరికి ఆడపక్షి గుండెలు అవిసిపోయాయి, వాటి ఎడబాటు అన్న ఆలోచనే సహించజాలక. ఆ క్షణం ఏదో ఒక నాడు వస్తుందని ఎరిగినా, అంత త్వరగా వస్తుందనుకోలేదు.

భార్య దిగులు, ఆవేదన చూస్తే మగపక్షికి జాలివేసింది. పిల్లలు దూరమవుతున్నారంటే తనకూ బాధగానేయుంది. కాని, అది ప్రకృతి ధర్మం!

“జీవి పుట్టాక గిట్టడం ఎంత సహజమో, రెక్కలు వచ్చిన పిల్లలు ఎగిరిపోవడమూ అంతే సహజం! అది ధర్మం కూడాను. సంతానాన్ని ప్రేమానురాగాలతో పెంచడం, తమ కాళ్ళ పైన తాము నిలవగలిగే స్థాయికి వారిని తయారుచేయడం తల్లిదండ్రుల బాధ్యత…” భార్యకు నచ్చజెప్పడానికి ప్రయత్నించింది మగపక్షి.

“నిజానికి ఎదిగివచ్చాక కన్నవారి పైన ఆధారపడకుండా స్వశక్తి పైన నిలబడగల ఆత్మవిశ్వాసము, తెగువ, సామర్థ్యము ఒక్క మన పక్షిజాతికే ఉన్నాయి. మన జాతికి దేవుడు ఇచ్చిన వరం అది! ఆ విషయంలో మానవులకంటే మనమే మిన్న…”                                                                                             ఆడపక్షి మాట్లాడలేదు. తల్లి దుఃఖం చూస్తూంటే పిల్లలకు దిగులుగా ఉంది.

“నువ్వు మళ్ళీ గుడ్లు పెట్టి, పొదుగు. కొత్త సంతానానికి జన్మనిద్దాం. వాటితో మన ప్రేమానురాగాలను పంచుకుని ఆనందించుదాం. మన వంశాన్ని వృద్ధి చేసుకుందాం. అదృష్టముంటే మన పాత సంతానం ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట, మనకు మళ్ళీ తారసపడకపోరు…కన్నప్రేమ సంతానం యొక్క స్వేచ్ఛకు, ప్రగతికీ ప్రతిబంధకం కాకూడదు,” ఓదార్చింది మగపక్షి.

అదే సమయంలో-

వేపచెట్టు ఉన్న ఆ ఇంటిలోంచి పెద్ద గొడవ వినిపించింది…ఆ ఇంటి యజమానికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళూను. అందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఉమ్మడి కుటుంబం. భుక్తి కోసం కోదుకులు ఏం చేస్తారో తెలియదు కాని, తరచు డబ్బుల కోసం వయసు మళ్ళిన తల్లిదండ్రులను వేధిస్తూంటారు. ఆస్థులు పంచమని గొడవ చేస్తూంటారు. వారికి వత్తాసుగా వారి భార్యలు తోడవుతారు. ఆస్థి చేతికి రాగానే వృద్ధులైన అత్తమామల్ని ఇంటినుండి బైటకు గెంటివేయాలన్నది కోడళ్ళ కుతంత్రం.

కొడుకులకు ఆస్థి పంచేసి, వారిని వేరు పెట్టేయాలనుకుంటాడు తండ్రి. కాని తల్లి పడనివ్వదు, కొడుకుల్ని విడిచి ఉండలేనంటూ. అంతా కలిసే ఉండాలంటుంది, వారి మూలంగా ఇంట్లో శాంతి sకరవైనా! ఏం చేయాలో బోధపడక ఆ యజమాని సతమతమవుతూంటాడు…

ఆ వేపచెట్టు పైన కాపురం పెట్టినప్పట్నుంచీ ఆ ఇంటి భాగోతం చూస్తూనే ఉన్నాయి ఆ పక్షి దంపతులు.

“చూసావా, ఆ మనుషుల్లా మన జాతి కష్టపడనందుకు సంతోషించాలి మనం. మన సంతానం మనల్ని గూట్లోంచి తరిమేసి గూటిని స్వంతం చేసుకోవాలనుకోదు. స్వశక్తితో ఎదగాలనుకుంటుంది. ఒరుల కష్టం పైన ఆధారపడకుండా ఎవరి ఆహారం వారే సంపాదించుకోవాలనుకునేది మన జాతి ఒక్కటే!” అంది మగపక్షి సగర్వంగా.

భర్త పలుకులు అక్షరసత్యాలని గుర్తించిన ఆడపక్షి – విశాల విశ్వం లోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతూన్న తన సంతానాన్ని నిరోధించరాదని నిర్ణయించుకుంది, ఆ నిర్ణయం తన గుండెల్ని బరువెక్కిస్తున్నా సరే! భావిలో తన సంతానం క్షేమంగా ఉండాలని భగవంతుడికి మనస్ఫూర్తిగా మొక్కుకుంది అది.

857 Comments